వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలపై మరింత దృష్టి పెడతారు. అదే సమయంలో తన కొడుకు జగన్ మోహన్ రెడ్డి (జీవా)ను ప్రజలకు పరిచయం చేస్తాడు. ఎంపిగా పోటీ చేయిస్తాడు వైఎస్ఆర్. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో రచ్చబండకు బయల్దేరిన వైఎస్ హెలికాప్టర్ మిస్ అయిపోవడం.. ఆయన చనిపోవడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఎమ్మెల్యేలు తమకు ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ప్రతిపాదిస్తే.. దాన్ని హై కమాండ్ కాదనడం.. ఆయన్ని తీవ్రంగా అవమానించడంతో పార్టీ నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాడు. అక్కడ్నుంచి హై కమాండ్‌కు కొరకరాని కొయ్యగా మారిపోతాడు. పార్టీని బలోపేతం చేస్తున్న సమయంలోనే.. అక్రమాస్తుల కేసులో జగన్‌ను జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. మళ్లీ అక్కడ్నుంచి ఎలా నిలిచాడు.. గెలిచాడు అనేది అసలు కథ..
కథనం:
యాత్ర 2ను కేవలం ఓ సినిమా లవర్‌గా మాత్రమే చూసే వాళ్ళకు ఈ సినిమా బాగానే అనిపిస్తుంది. అక్కడున్నది జగనా.. చంద్రబాబా అనేది పక్కనబెడితే.. మహి వి రాఘవ్ మరోసారి కథ చెప్పడానికి ఎమోషన్‌నే నమ్ముకున్నాడు. ఫస్ట్ సీన్ నుంచే ఈ మ్యాజిక్ చూపించడం మొదలుపెట్టాడు మహి. అందులో భాగంగానే ఓ చెవిటి అమ్మాయికి ఆపరేషన్ చేయించడం.. ఓ అంధుడిని చేరదీసి మాట్లాడటం ఇవన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మమ్ముట్టి ఉన్న సీన్స్ అన్నీ మరోసారి హైలైట్ అయ్యాయి. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నది కాసేపే అయినా.. మరోసారి ఎమోషన్ అద్భుతంగా పండింది. అలాగే జగన్ ఎపిసోడ్స్ మొదలైన తర్వాత కూడా స్పీడ్ ఎక్కడా తగ్గలేదు. డిల్లీ నుంచి ఎదురయ్యే సవాళ్లు.. రాష్ట్రంలోని సమస్యలు.. ఎన్ని మీదకు వస్తున్నా.. ఒక్కడే ముందుకెళ్లాడు అని చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. యాత్ర రేంజ్లో ఇందులో ఎమోషన్ అయితే కచ్చితంగా పండలేదు. అందులో రాజశేఖర్ రెడ్డి ఎందుకు పాదయాత్ర చేసాడు.. దాని వెనక కారణాలేంటి.. అనే ఓ విశ్లేషణాత్మకంగా ముందుకు సాగుతుంది కథ.. అందుకే అంతగా కనెక్ట్ అయింది. ఇందులో ఎమోషన్స్ కంటే ఎక్కువగా పాలిటిక్స్ కనిపించాయి. ఒకరిపై ఒకరు యుద్దం.. ఒక్కడిపై అందరూ చేసే కుట్రలు.. ఇవే ఎమోషన్స్‌ను డామినేట్ చేసినట్లు అనిపించాయి. ఇక డైలాగ్స్ అయితే నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి.. ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయాయి. యాత్రలో కూడా రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఉన్నా.. డైరెక్ట్ హిట్టింగ్‌గా మాత్రం ఉండదు. కానీ ఇందులో అలా కాదు.. అంతా కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు.. నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్లు చూపించారు. జగన్ జీవితంలో జరిగిన నాటకీయ పరిణామాలకు మరింత సినిమాటిక్ టచ్ ఇచ్చాడు దర్శకుడు మహి. కథా పరంగా చంద్రబాబు, సోనియా గాంధీ లాంటి కారెక్టర్స్‌ను ఓ రకంగా విలన్లుగానే చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే విలన్ అని చెప్పడం కంటే.. రాజకీయం కోసం ఏదైనా చేసే ఫక్తు పొలిటికల్ గేమ్ ఇందులో చూపించాడు దర్శకుడు. అదే సమయంలో జగన్‌ను ప్రతీ విషయంలోనూ నిజాయితీ పరుడిగానే చూపించాడు. ఓ వ్యక్తి తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడనేది ఇందులో ఫోకస్ చేసాడు. అది బలంగా చూపించే ప్రయత్నం చేసాడు.. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా.
నటీనటులు:
వైఎస్ జగన్‌గా జీవా బాగున్నాడు.. స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటుంది. జగన్ హావభావాలు చాలా వరకు మ్యాచ్ చేసాడు జీవా. వైఎస్ఆర్గా మమ్ముట్టి గురించి చెప్పడానికేం లేదు.. అద్భుతం అంతే. కొన్ని సన్నివేశాల్లో అతన్ని చూస్తుంటే నిజంగానే వైఎస్ అక్కడున్నాడేమో అనిపిస్తుంది. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ బాగున్నాడు.. సోనియా గాంధీ పాత్రలో ఫారెన్ నటి సుజానే బెర్నర్ట్ అద్భుతంగా నటించారు. మరో కీలకమైన పాత్రలో శుభలేక సుధాకర్ కూడా బాగున్నాడు. మిగిలిన పాత్రలన్నీ ఓకే..
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు మెయిన్ పాజిటివ్ సంగీతం. సంతోష్ నారాయణన్ తన మ్యూజిక్‌తో చాలా సీన్స్ ఎలివేట్ చేసాడు. మధి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. సీన్స్ అన్నీ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ కూడా షార్ప్‌గానే ఉంది. రెండు గంటల్లోనే సినిమా అయిపోయింది. ఇక దర్శకుడు మహి వి రాఘవ్ తను అనుకున్నది స్క్రీన్ మీద చూపించాడు. పొలిటికల్‌గా ఈ సినిమా ఓ పార్టీకి హెల్ప్ అవుతుందా లేదా అనేది పక్కనబెడితే తను అనుకున్న కథను బాగా రాసుకున్నాడు.. అలాగే ఓ వ్యక్తి సంకల్పం ముందు దేవుడే ఎదురుగా వచ్చి ఆపాలనుకున్నా అది ఆగదని చూపించాడు మహి.