శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు శరన్నవరాత్రి వేడుకల్లో మూడో రోజు.. అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.భ్రమరాంబికా దేవి స్వామివారితో కలిసి పురవీధుల్లో రావణవాహనం వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు మల్లన్న స్వామీ అమ్మవారిని మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకోనున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవరోజు భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించారు. బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు చెక్క భజనలు వివిధ రకాల గిరిజన నృత్యాలు వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.