గత నెల 22న జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న పహల్గాం దాడి అనంతరం పాక్- భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు కూడా చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతలకు ఎట్టేకేలకు శనివారం (మే 10) తెరపడింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్, భారత్ ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగశాఖ నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే ఇరు దేశాలు తాము కాల్పులు విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
శనివారం సాయంత్రం 5 గంటల నుంచి భూ, గగన, సముద్ర తలాలపై కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేస్తామని, ఇందుకు భారత్, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) అంగీకరించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.35 గంటలకు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో చర్చలు జరిగాయన్నారు. పాకిస్థాన్ డీజీఎంఓ భారత్ డీజీఎంవోకు ఫోన్ చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించాయన్నారు. నేటి సాయంత్రం 5గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి ఇరుదేశాల సైన్యానికి ఆదేశాలు వెళ్లాయని, దీనిపై మే 12న మధ్యాహ్నం 12 గంటలకు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (డీజీఎంవోలు) మళ్లీ చర్చలు జరుపుతాయని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.