రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబు ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఇందుకోసం బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది విన్న బాలయ్య అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. ‘జైలర్’ సినిమా పాన్ ఇండియా మూవీ. కాబట్టి డైరెక్టర్ అన్ని భాషలకు సంబంధించిన ప్రముఖ నటులను ఇందులో భాగం చేస్తున్నాడు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ లను అతిథి పాత్రల్లో తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే బాలయ్యను తీసుకున్నారని తెలుస్తోంది.
జైలర్ 2 సినిమా కోసం బాలయ్య 20 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నందమూరి హీరో ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక రోజు షూట్ కి దాదాపు 2.5 కోట్ల రూపాయలు అన్నమాట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య కెరియర్ లోనే జైలర్ 2 కోసం అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారని చెప్పవచ్చు.
‘జైలర్’ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రజనీకాంత్ ‘టైగర్’ ముత్తవేల్ పాండియన్ పాత్రలో అదరగొట్టారు. సూపర్ స్టార్ మాస్ అవతార్ ను చూసి అభిమానులు తెగ సంబర పడ్డారు. ఇక వినాయకన్ విలన్ పాత్రలో కనిపించగా, రమ్య కృష్ణన్ రజనీకాంత్ భార్య పాత్రలో నటించింది. తమన్నా భాటియా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ కు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన బోయపాటి శీనులే రెండో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.