అంబాసిడర్ కారు. ఇది చాలామందికి ఒక ఎమోషన్. ఇప్పటి జనరేషన్ కి ఐతే చాలామందికి అలాంటి ఓ కారు ఉందని కూడా తెలియదు. కానీ 1990 వరకు ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు, వ్యాపారవేత్తల నుంచి ఉన్నత స్థాయి వర్గాల వరకు అందరూ తిరిగిన కారే అంబాసిడర్. రెండు మూడు దశాబ్దాల పాటు రోడ్డుపై కింగ్ అంబాసిడరే. ఇప్పుడు అంబాసిడర్ కార్ అసలు రోడ్ల పైన కనిపించడం లేదు. ఇదే అంబాసిడర్ కారుకు సంబంధించి ఇంకొక యాంగిల్.
తెలంగాణలో రెండుసార్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సింబల్ కూడా అంబాసిడర్ కారు. ఇక గులాబీ శ్రేణులకు ఈ కారుతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలో ఈ కార్లను అక్కడక్కడ ప్రదర్శించి ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. గతంలో అయితే ప్రతి గులాబీ పార్టీ నేత ఇంట్లో ఒక అంబాసిడర్ కారు ఉండేది. రాను రాను అవి కనుమరుగైపోయాయి. అక్కడక్కడ రోడ్ల పక్కన కనిపిస్తున్న అవి పనిచేయక పక్కన పడేసిన అంబాసిడర్ కార్లు. ఇక బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ సందర్భంగా రవి యాదవ్ అనే యువనేత 100 అంబాసిడర్ కారులను సేకరించాడు. గత రెండు నెలలుగా సేకరించిన అంబాసిడర్ కార్లకు రిపేర్లు చేయించి గులాబీ పెయింట్ వేయించి.. కేసీఆర్ స్టిక్కర్లు అంటించి సిద్ధం చేశాడు.
ఈనెల 27న వరంగల్లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ భారీ బహిరంగ సభకు ఈ 100 కారులను ర్యాలీగా తీసుకెళ్ళనున్నారు గులాబీ నేతలు. నిజంగా ఈ యువనేత 100 కాళ్లు సేకరించడం గ్రేట్ అనిపిస్తుంది. అసలు ఎక్కడో కానీ కనిపించని ఈ పాత అంబాసిడర్ కార్లను సేకరించి రిపేరు చేయించి వందల కిలోమీటర్లు నడిచేలా సిద్ధం చేయడం కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. వీటిని ఇలాగే మైంటైన్ చేస్తా అంటున్నాడు రవి యాదవ్. వచ్చే ఎన్నికల నాటికి ప్రతి నియోజకవర్గానికి ఒక అంబాసిడర్ కారు పంపిస్తానని కూడా గులాబీ నేతలు చెప్తున్నారు. 100 అంబాసిడర్ గులాబీ రంగు కార్లు రోడ్లపై వెళ్తుంటే ఈ లుక్ అదిరిపోతుంది.